Breaking Newshome page sliderHome Page SliderTelangana

డీసీసీ అధ్యక్షులకు ఆరు నెలల గడువు

తెలంగాణలో కొత్తగా నియమితులైన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి ఆరు నెలల గడువు మాత్రమే ఇచ్చారు.డీసీసీ అధ్యక్షులు పదవులు వచ్చాయని సంతోషపడటమే కాదు, పార్టీ బలోపేతం కోసం పూర్తిస్థాయిలో పని చేయాల్సిందేనని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఆరు నెలల్లో వారి పనితీరును సమీక్షిస్తామని, ఫలితాలు సంతృప్తికరంగా లేకపోతే అక్కడికక్కడే పదవుల నుంచి తొలగించి కొత్త నాయకత్వాన్ని నియమిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. పార్టీలో పనితీరు ఆధారిత వ్యవస్థను తీసుకురావడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాన్ని ఎఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమర్థించగా, గుజరాత్‌లో అయితే డీసీసీ అధ్యక్షులకు మూడు నెలల గడువు కూడా ఇస్తున్నామని ఆమె వెల్లడించారు.


తెలంగాణలో డీసీసీల పునర్వ్యవస్థీకరణ ద్వారా పార్టీని కింది స్థాయిలో నుంచే బలోపేతం చేయాలన్న వ్యూహం రూపొందించబడింది. ఈ ప్లాన్‌ను అక్టోబర్ 24న ఢిల్లీలో ఎఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్‌తో జరిగిన సమావేశంలో ఖరారు చేశారు. కొత్త జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలకు చురుకుదనం తీసుకురావాలి, అమలు పరిస్థితులను ఎప్పటికప్పుడు ఆబ్జర్వర్లు, టీపీసీసీ నాయకత్వం పరిశీలిస్తారు. పనితీరు తక్కువగా ఉంటే ఆరుగాలంలోనే మార్పులు జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 33 జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికలో కుల సమతుల్యత పాటించడంతో పాటు, కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే కొన్ని నియామకాలపై అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. నల్గొండలో పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా, మహబూబాబాద్‌లో భుక్యా ఉమా నియామకం వెన్నం శ్రీకాంత్ రెడ్డికి నచ్చలేదు. కరీంనగర్, వనపర్తి జిల్లాల్లో కూడా ఇలాంటి అభ్యంతరాలు వెలువడ్డాయి.


గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో కొత్త డీసీసీ అధ్యక్షులకు పంచాయతీ ఎన్నికల వ్యూహంపై సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు చేరవేయాలన్నది ఆయన ఆదేశం. మొత్తం మీద రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కొత్త వ్యవస్థ, కాంగ్రెస్‌ను క్రమబద్ధమైన సంస్థగా మార్చే ప్రయత్నంలో భాగమే. 2028–29 ఎన్నికలకు ముందే పార్టీని దృడంగా తయారు చేయాలన్న దృష్టితో రేవంత్ ఇప్పటి నుంచే కఠిన చర్యలకు వెనుకాడటం లేదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.