Breaking Newshome page sliderHome Page SliderTelangana

మెస్సీ కోసం సిద్ధమవుతున్న సీఎం రేవంత్‌

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండో రోజు కూడా ఫుట్‌బాల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఎంసీహెచ్ఆర్డీ మైదానంలో పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేస్తూ కనబర్చిన ఉత్సాహం రాజకీయ వర్గాల్లోనే కాదు, క్రీడాభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ నెలలో జరగనున్న ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో సీఎం పాల్గొననున్న నేపథ్యంలో ముందుగానే ఆయన ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇదే సమయంలో డిసెంబర్ 13న ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. భారత్ పర్యటనలో భాగంగా మెస్సీ ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసే అవకాశాలు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ కార్యక్రమంలో భాగంగా మెస్సీని రాష్ట్ర గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో సీఎం పాల్గొనవచ్చన్న వార్తలతో ఆయన ప్రాక్టీస్‌కు మరింత ప్రాధాన్యం లభించింది. వరుసరోజులు ఫుట్‌బాల్ మైదానంలో చెమటోడ్చుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి ఈసారైనా ‘తగ్గేదేలే’ అన్నట్లు ఉప్పల్ మైదానంలో మెస్సీతో పాటు ఆడతారని పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందంగా చెబుతున్నారు.