‘దిట్వా’ తుపాను అలర్ట్: వాయుగుండం వేగంగా బలపడుతోంది
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన వాయుగుండంగా, బలపడి గురువారం సాయంత్రానికి తుపానుగా మారే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపానుకు ‘దిట్వా’ అనే పేరు పెట్టారు. ప్రపంచ వాతావరణ సంస్థ సభ్య దేశాల జాబితాలో యెమెన్ దిట్వాను సూచించింది. సోకోత్రా ద్వీపంలోని ప్రసిద్ధ ‘దిట్వా లగూన్’ ఉప్పునీటి సరస్సు పేరు ఆధారంగా చేసుకుని నామకరణం చేశారు. సముద్రంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాతావరణ వ్యవస్థ బలపడి తీరం వైపు కదులుతున్న క్రమంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వాయవ్య దిశగా కదులుతున్న దిట్వా శ్రీలంక తీరాన్ని దాటి, శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుకునే అవకాశాన్ని భారత వాతావరణ విభాగం సూచించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తుపాను కదలికలను నిరంతరం గమనిస్తూ, అవసరమైనప్పుడల్లా హెచ్చరికలు జారీ చేసేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.
చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకారం, గురువారం దక్షిణ తమిళనాడు, డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం తీవ్రత పెరుగుతుందని, ముఖ్యంగా డెల్టా ప్రాంతం , పరిసర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నాటికి ఈ వ్యవస్థ ఉత్తరం వైపు కదులుతున్నకొద్దీ ఉత్తర తమిళనాడు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు

