BusinessHome Page SliderNationalNewsviral

బంగారం ఉత్పత్తిలో గేమ్ ఛేంజర్‌గా భారత్

దేశంలో బయటపడుతున్న భారీ బంగారు గనులు
. రాజస్థాన్, ఏపీలలో కొత్త గనులలో టన్నుల కొద్దీ బంగారం
. బంగారం దిగుమతుల తగ్గే అవకాశం
. స్వదేశంలోనే ప్రాసెసింగ్ కేంద్రాలు
. బంగారం తవ్వకాలలో గ్రీన్ టెక్నాలజీ

ఇంటర్నెట్ డెస్క్ : భారతదేశం ప్రపంచ బంగారం మార్కెట్‌లో ఇప్పుడు కొత్త అధ్యాయం ప్రారంభించబోతోంది. కొత్తగా ఏపీ, రాజస్థాన్ లో బయటపడిన బంగారు గనులలో దాగున్న నిక్షేపాల వల్ల ఇప్పటివరకు ప్రధానంగా దిగుమతులపై ఆధారపడిన భారత్, త్వరలోనే స్థానిక బంగారం ఉత్పత్తి లో కీలక అడుగులు వేయనుంది. బంగారం ఉత్పత్తిలో భారత్ కొత్తగా ప్రవేశించడం, ప్రపంచ మార్కెట్‌లో ధరల మార్పులకు ప్రభావం చూపే అవకాశం ఉంది. విశ్లేషకుల ప్రకారం, “ఇది భారత్‌కు ఒక గేమ్ ఛేంజర్ మూమెంట్”గా నిలుస్తుందని చెబుతున్నారు. భారతీయులకు సహజంగానే బంగారం అంటే మక్కువ ఎక్కువ. దీనితో బంగారాన్ని అధికంగా కొనుగోలు చేస్తారు. అయితే బయటి దేశాల నుండి చేసుకునే దిగుమతుల వల్ల విదేశీ మారకద్రవ్యాన్ని గణనీయంగా కోల్పోతోంది భారత్. అయితే ఇటీవల భారత్ లో బయటపడుతున్న బంగారు గనులు దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త మలుపు తిప్పబోతున్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు అందనంత ఎత్తులో సామాన్య ప్రజలకు భారంగా ఉన్న సంగతి తెలిసిందే.
తాజాగా రాజస్థాన్ రాష్ట్రంలో బన్స్వార జిల్లాలోని ఘటోల్ తెహసీల్ కంకారియా గ్రామం వద్ద భారీ బంగారు గని ఉన్నట్లు అధికారులు వెల్లడి చేశారు. ఈ కొత్త గనిలో 940 హెక్టార్ల విస్తీర్ణంలో వంద మిలియన్ టన్నుల బంగారు ఖనిజం ఉండొచ్చని, దాన్ని ప్రాసెస్ చేస్తే దాదాపు 220 టన్నుల స్వచ్ఛమైన బంగారం లభిస్తుందని అంచనాలు వేస్తున్నారు. దీనితో దేశ ఆర్థిక రంగంలో ఇది కీలక మార్పును తెస్తుందని భావిస్తున్నారు. ఈ జిల్లాలోనే దేశంలోని 25 శాతం బంగారు డిమాండ్ ను తీర్చగలిగే బంగారం లభిస్తుందని చెప్తున్నారు. ఇక్కడ భూకియా, జగ్ పురా గనులతో పాటు ఇది మూడవగనిగా చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి గని, మధ్యప్రదేశ్ లోని బంగారు గనులలో భారీగా బంగారం దొరికే ఛాన్స్ ఉందంటున్నారు. ఈ గనుల ప్రాసెసింగ్ తో స్థానిక ప్రజలకు కూడా ఉపాధి దొరకనుంది.
భారత భూగర్భ శాస్త్ర సర్వే (GSI) తాజా నివేదిక ప్రకారం, రాష్ట్రాలు అయిన కర్ణాటక, రాజస్థాన్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ లలో ఉన్న బంగారం గనులను పునరుద్ధరించి, కొత్త బ్లాకులను అన్వేషించే ప్రక్రియ ప్రారంభమైంది. అలాగే కర్ణాటక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ తిరిగి తెరవబడే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది. సంవత్సరానికి సుమారు 800–900 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటోంది.
ఈ ఉత్పత్తి విస్తరణతో, దేశం దిగుమతులపై ఆధారపడడం 25శాతం వరకు తగ్గించే లక్ష్యంతో ముందుకెళ్తోంది. దేశీయ బంగారం ఉత్పత్తి పెరిగితే, డాలర్ డిమాండ్ తగ్గి రూపాయి బలపడే అవకాశం ఉంది. జువెలరీ ఎగుమతులు పెరగడంతో, భారతదేశం బంగారం ప్రాసెసింగ్, రిఫైనింగ్‌ లో హబ్‌ గా ఎదగవచ్చు. భారత ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు కలిసి బంగారం తవ్వకాలలో గ్రీన్ టెక్నాలజీని ఉపయోగించి, ఎకో ఫ్రెండ్లీ పద్దతిలో ప్రయత్నాలు ప్రారంభించాయి. సాధారణ వాతావరణానికి, నీటి వనరులకు హానికరం కాని విధంగా తవ్వకాల పద్ధతులు రూపొందిస్తున్నారు.