Home Page SliderInternationalNewsTrending Todayviral

భూమి దిశగా ఇంటర్ స్టెల్లార్ తోకచుక్క ! ఇది ఏలియన్ టెక్నాలజీనా?

. భూమివైపు దూసుకొస్తున్న భారీ తోకచుక్క
.గ్రహాంతర వాసులు పంపారంటూ పుకార్లు
. సౌర వ్యవస్థలో గ్రహాల మీదుగా సూర్యుని వైపు పయనం
. ఇతర నక్షత్రమండలం నుంచి వచ్చిందని రుజువులు
. ఆశ్చర్యకరమైన అతివేగం, సైజు, రేడియో సిగ్నల్స్
ఇంటర్నెట్ డెస్క్ : శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేసిన అతి పెద్ద తోకచుక్కను జూలై 1వ తేదీన హవాయ్ దీవుల్లోని గల నాసా ATLAS టెలిస్కోప్ గుర్తించింది. ఇది డిసెంబర్ 19వ తేదీన భూమికి అత్యంత దగ్గరగా రానుంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్లు మొదలయ్యాయి. దీనిని ఇంటర్ స్టెల్లార్ వస్తువుగా భావిస్తున్నారు. అంటే ఇది మన సౌర కుటుంబానికి చెందినది కాదు. “3I/ATLAS” పేరుతో గుర్తించబడిన ఈ వస్తువు మన సౌర వ్యవస్థ వెలుపల నుండి ప్రవేశించింది. ఇది మనుషులు ఇప్పటివరకు గమనించిన మూడవ అంతర్‌ తారక అతిథిగా చెప్పవచ్చు.
‘ఇదిగో పులి అంటే అదిగో తోక ‘ అంటారు పుకారు రాయుళ్లు. అలాగే ఇది ఏలియన్స్ భూమిపై పంపిన ఒక శక్తివంతమైన వస్తువుగా కొందరు పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే ఈ వాదనలను శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ఇది ఈ నెల 29న సూర్యునికి దగ్గరగా వెళ్లనుంది. డిసెంబర్ 19న భూమికి దగ్గరగా రానుంది.ఇది అధికారికంగా తోకచుక్కగా భావించినప్పటికీ భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనిని గ్రహాంతర వాసులు పంపారని అది అంతరిక్ష నౌక అయి ఉండొచ్చంటున్నారు. సాధారణ తోకచుక్కల కన్నా ఇదెంతో భిన్నంగా ఉందని, చాలా పెద్దదని వీనస్, మార్స్, జూపిటర్ గ్రహాలకు కూడా సమీపంలో వెళ్లే అవకాశం ఉండడం యాదృచ్ఛికం కాదంటున్నారు. అది సౌర కుటుంబాన్ని శోధించడానికి ఏలియన్లు పంపిన రాకెట్టే నంటూ కొందరు వాదిస్తున్నారు.
ఇది ఎక్కడినుంచి వచ్చిందో స్పష్టంగా తెలియదు. శాస్త్రవేత్తలు భావిస్తున్న ప్రకారం ఇది మరొక నక్షత్ర వ్యవస్థలోని ధూమకేతువు లేదా గ్రహఖండం నుంచి విడిపోయి అంతరిక్షం గుండా ప్రయాణిస్తూ మన సౌర వ్యవస్థలోకి ప్రవేశించి ఉండవచ్చు. నాసా వివరాల ప్రకారం, దీని ప్రస్తుత దిశ పెర్సియస్ నక్షత్రరాశి వైపు నుంచి వచ్చిందని భావిస్తున్నారు. దీని కక్ష్య సాధారణ సౌర వ్యవస్థ గ్రహాలు, ధూమకేతువుల వలె కాకుండా హైపర్‌బాలిక్ ట్రాజెక్టరీలో ఉంది — అంటే ఇది మన సౌర వ్యవస్థకు శాశ్వత నివాసి కాదు, బయట నుండి వచ్చింది అన్న మాట.
శాస్త్రవేత్తల గణనల ప్రకారం దీని వేగం సెకనుకు సుమారు 26 కిలోమీటర్లు, అంటే గంటకు 93,000 కిలోమీటర్లకు పైగా ఉంది. ఇంత అసాధారణ వేగంతో ఇది భూమి వైపు వచ్చినా, భూమికి ఏ ప్రమాదమూ లేదు. దీని మార్గం మన గ్రహం పక్కనుండే దూరంగా వెళ్తుంది. ఇది సూర్యుడి సమీపం గుండా పయనించి, తిరిగి అంతరిక్షంలోకి బయలుదేరిపోతుందంటున్నారు శాస్త్రవేత్తలు.
నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల పరిశీలనల ప్రకారం ఇది భూమికి కనీసం లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇలాంటి వస్తువులు చాలా అరుదు. ఇవి మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న పదార్థాల నిర్మాణం, రసాయనాలు, అంతరిక్ష పరిస్థితులు గురించి వీటి ద్వారా కొత్త సమాచారం తెలుసుకోవచ్చు. 3I/ATLAS నుంచి వెలువడే వాయు, దూళి, కాంతి ప్రతిబింబం వంటివి పరిశీలించడం ద్వారా, మనకు ఇతర నక్షత్ర వ్యవస్థల నిర్మాణం గురించి అంచనాలు వేయవచ్చు.
నాసా ప్రస్తుతం దీనిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ , ఇతర భూమి టెలిస్కోప్స్ ద్వారా దీన్ని ట్రాక్ చేస్తోంది. దీని అసాధారణ కక్ష్య మార్గం గ్రహాల కక్ష్యలతో సరిపోలడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా సూర్యుని వైపుగా స్పేస్ మెటీరియల్ పంపించడం, దీని వాయు మేఘాలలో నికెల్ ఉండడం కూడా సైంటిస్టులు గమనించారు. సాధారణ తోకచుక్కలు అధికభాగం నీటితో ఉంటే..ఇది మాత్రం కేవలం 4 శాతం మాత్రమే నీరు కలిగి ఉంది. అలాగే వింత కాంతిని ప్రతిబింబించడం, పైగా దీని నుండి వింత వింత రేడియో సిగ్నల్స్ రావడం ఆసక్తిగా మారింది.