“కాంగ్రెస్‌లో తన్నుకుంటున్నారు, ప్రజల కోసం కాదు” – హరీశ్‌రావు విమర్శలు
కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా విభేదాలతో కుదేలైందని, అక్కడ “ఇంట్లో ఈగల మోతా… బయట పల్లకిల మోతా” పరిస్థితి ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మంత్రులు, ముఖ్యమంత్రి పంపకాలపై తన్నుకుంటున్నారని ఆయన విమర్శించారు. “మొన్న కొండా సురేఖ కుమార్తె, నిన్న జూపల్లి కృష్ణారావు ఎలా మాట్లాడారో చూశారు కదా. క్యాబినెట్‌లో కూడా బట్టలూడదీసుకొని తిట్టుకున్నారట,” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణ భవన్‌లో వడ్డెర సంఘం సమావేశంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ, వడ్డెర సమాజానికి కేసీఆర్ ప్రభుత్వం ఎంత సహాయం చేసిందో గుర్తుచేశారు. “సిద్దిపేటలో వడ్డెరలకు ట్రాక్టర్లు ఇచ్చాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొరం కొట్టుకునే వారిపై కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తోంది,” అని అన్నారు.
హైదరాబాద్‌లో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించగా, రేవంత్ రెడ్డి వాటిని కూలగొట్టారని ఆయన ఆరోపించారు. “పేదల ఇళ్లు కూల్చొద్దంటే, హైడ్రా బందు కావాలంటే కాంగ్రెస్‌ను ఓడించాలి,” అని పిలుపునిచ్చారు.
మహిళలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000 పెన్షన్ ఇస్తామని చెప్పిన గ్యారంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. “మహిళలకు 2,500 రాలేదు, వృద్ధులకు 4,000 రాలేదు, అయినా ఓటేయాలని అంటున్న రేవంత్ రెడ్డి అహంకారం చూస్తే ఆశ్చర్యంగా ఉంది,” అని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించి, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని ప్రజలను ఆయన కోరారు.

