తుఫాన్‌పై ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆదేశించిన సీఎం
రాబోయే తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రతి విభాగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు.
టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లు, అధికారులు పాల్గొనగా, సీఎం మాట్లాడుతూ — ప్రజలను తుఫాన్ ప్రమాదం గురించి ముందుగానే అప్రమత్తం చేయాలని ఆదేశించారు. SMS, సోషల్ మీడియా, IVRS కాల్స్, వాట్సాప్ వంటి మార్గాల ద్వారా ప్రజలకు సమాచారం చేరేలా చూడాలని సూచించారు.
తుఫాన్ ప్రభావం సమయంలో విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడానికి కలెక్టర్లకు అధికారమిచ్చారు.
ప్రజల భద్రతకు అత్యవసర సేవలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే రక్షణ బృందాలను ముందుగానే పంపించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

