Home Page SliderLifestyleNationalNews Alertviral

అమ్మమ్మల స్కూల్ ఈ “ఆజిబైచి శాల”

వృద్ధ మహిళల కోసం ప్రత్యేక పాఠశాల
. సమానత్వం, మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణ
. ఒంటరితనాన్ని పోగొట్టే అరుదైన పాఠశాల
. ఉపాధ్యాయుడు యోగేంద్ర బంగార్ కృషి

ఇంటర్నెట్ డెస్క్ : భారతదేశంలో, వృద్ధులైన మహిళల కోసం ప్రత్యేకంగా స్థాపించబడిన ఏకైక పాఠశాల “ఆజిబైచి శాల” మహారాష్ట్ర రాష్ట్రంలోని ఫంగణే గ్రామంలో ఉంది. ఈ పాఠశాల వయోజన మహిళలకు చదవడం, రాయడం, ప్రాథమిక గణితం నేర్పించేందుకు ప్రారంభించబడింది. ఇది వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. పెద్దవయసులో బాధ్యతలు తీరిపోయాక ఒంటరితనం ఫీలవుతున్న స్త్రీల కళ్లలో వెలుగు నింపింది ఈ స్కూల్. మహారాష్ట్రలో పదేళ్ల క్రితం మొదలైన ఈ స్కూల్ ఇంకా కొనసాగుతోంది.
2016లో ఈ స్కూల్ ప్రారంభం తమాషాగా జరిగింది. ముంబయికి 120 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ గాథను గానం చేశారు. ఆ ఊరిలోని చదువురాని[అవ్వలకి ఈ కథ సరిగ్గా అర్థం కాలేదు. వారు ఆ ఊరి ఉపాధ్యాయుడైన యోగేంద్ర బంగార్ వద్దకు వెళ్లి మేం కూడా చదువుకుని ఉంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్లం అన్నారు. దీనితో అతని మనసులో వారికి స్కూల్ పెట్టాలనే ఆలోచన వచ్చింది. అంతేకాక ఇలాంటి స్కూల్ వల్ల వారు ఒంటరితనం నుండి కూడా బయటపడతారని ఆలోచించి 2016 మార్చి 8 మహిళా దినోత్సవం రోజు అవ్వలబడిని ప్రారంభించారు. మహిళలు ముందు భయపడినా తర్వాత ఒక్కొక్కరుగా ఆ స్కూల్ లో చేరారు.


వారు పనులన్నీ అయ్యాక మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకూ స్కూల్ కు వస్తారు. మరాఠీ లిపి, తేలికైన లెక్కలు, ఆర్ట్స్, క్రాఫ్ట్స్ నేర్చుకుంటారు. వారంతా గులాబీ రంగు చీరలు ధరించి వస్తారు. అలాగే ఈ స్కూల్ లో వృద్ధాప్యంలో ఆరోగ్యం, తీసుకోవల్సిన జాగ్రత్తలు కూడా నేర్చుకుంటారు. ప్రతీ ఊరిలో వృద్ధాశ్రమాల బదులు ఇలాంటి స్కూల్స్ ఏర్పాటు చేస్తే వృద్ధులకు ఒంటరితనం ఫీలింగ్ పోవడమే కాదు, వారు అక్షరాస్యులు కూడా అవుతారు. ఈ పాఠశాలకు 60 నుండి 90 సంవత్సరాల వయస్సున్న మహిళలు రావొచ్చు. వారు రోజుకు రెండు గంటల పాటు, వారానికి ఆరు రోజులు, పాఠశాలకు హాజరవుతారు. వారు మరాఠీ అక్షరమాల, సంఖ్యలు, తమ పేర్లను రాయడం నేర్చుకుంటున్నారు. “ఆజిబైచి శాల” పాఠశాల వృద్ధ మహిళలకు విద్యా అవకాశాలను అందించడం ద్వారా, వారి జీవితాలలో స్ఫూర్తిని, సంతృప్తిని కలిగిస్తోంది. ఇది సమాజంలో సమానత్వం, మహిళా సాధికారతకు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవల ఈ పాఠశాల పదేళ్ల వేడుకను సరదాగా జరుపుకున్నారు ఊరి మహిళలు.
[