home page sliderHome Page SliderNews

300 శాతం పైగా లాభంతో అదరగొట్టిన సావరిన్ బాండ్స్

ఇంటర్నెట్ డెస్క్ : బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. లోహం రూపంలో బంగారం కొనడం ద్వారా పెట్టుబడులు పెట్టేవారి కోసం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు ఏకంగా 300 శాతం పైగా భారీ లాభంతో అదరగొడుతున్నాయి. 8 ఏళ్ల కాలవ్యవధితో జారీ చేసిన 2017 – 2018 సిరీస్ 3 సావరిన్ గోల్డ్ బాండ్లు ఇప్పుడు అదరగొట్టే లాభాలు సంపాదించిపెట్టాయి. ఈ బాండ్లకు సంబంధించి వాటి కాలపరిమితి 8 ఏళ్లు ముగియనుండడంతో ఫైనల్ రిడెంప్షన్ తేదీని ఆర్బీఐ తాజాగా ప్రకటించింది. ఈ ధరలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఎందుకంటే అప్పుడు పెట్టుబడులు పెట్టిన వారికి ఇప్పుడు ఏకంగా 338 శాతం లాభాలు వచ్చాయి. దీనితో అప్పట్లో బంగారం బాండ్లు కొనుగోలు చేసిన వ్యక్తులు కుబేరులయినట్లే. 2017 అక్టోబర్ 16న రిజర్వ్ బ్యాంక్ బాండ్లు రిలీజ్ చేసింది. అప్పట్లో గ్రాము బంగారం ధర రూ.2,866 మాత్రమే. 8 ఏళ్ల కాలం పూర్తి కావడంతో మెచ్యూరిటీకి వచ్చిన ఈ బాండ్ల విలువను గత మూడు వ్యాపార పనిదినాలు దృష్టిలో పెట్టుకుని విలువ నిర్ణయించారు. దీని ప్రకారం ఇప్పుడు గ్రాముకి రూ.12,567గా నిర్ణయించారు. దీనితో ఒక గ్రాముపై ఏకంగా రూ.9700 పైగా లాభాలు వచ్చాయి.
దేశంలో ఫిజికల్ బంగారాన్ని కొనడానికి ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చు చేయాల్సి వస్తోంది. దీనిని తగ్గించే ఉద్దేశంతో ఆర్ బీఐ ఈ పథకం తీసుకొచ్చింది. ఇటీవల మూడు రోజుల సగటు ధరను ఆధారంగా చేసుకుని బాండ్లు రిడెంప్షన్ ధర నిర్ణయించారు. ఈ లాభాలపై పన్నులు కూడా లేకపోవడంతో మదుపర్లు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ బాండ్లు కొనాలనుకున్నవారికి బ్యాడ్ న్యూసే.. ఎందుకంటే ప్రభుత్వ ఖజానాకు భారం కావడంతో 2024 తర్వాత ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం చైనాపై అమెరికా సుంకాలు, ఆర్థిక అనిశ్చితుల వల్ల సురక్షితమైన బంగారం కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. అంతర్జాతీయంగా ఔన్సు బంగారం 4,292 డాలర్లు అయ్యింది.