2026 మార్చి నాటికి నక్సలిజం అంతమవుతుంది
మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు సహా 61 మంది ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయిన నేపథ్యంలో, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు.
సోషల్ మీడియా వేదికపై ఆయన ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , అమిత్ షా దృఢమైన సంకల్పానికి ఇది నిదర్శనమని , ఆయన చెప్పినట్లుగా 2026 మార్చి నాటికి నక్సలిజం పూర్తిగా అంతం కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు .
అంతర్గత భద్రత పట్ల అమిత్ షా రాజీలేని వైఖరి, కఠినమైన అమలు స్పష్టమైన ఫలితాలను ఇస్తున్నాయని, గడ్చిరోలి లొంగుబాటు సంఘటన దీనికి సాక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి నాయకత్వంలో దేశంలో శాంతి, భద్రత, అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
అదేవిధంగా, మావోయిస్టులకు పిలుపునిస్తూ , “ఇకనైనా ఆయుధాలను వదిలి ప్రధాన ప్రవాహంలోకి రావాలి. మావోయిస్టు నెట్వర్క్ కూలిపోతోంది, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు” అని బండి సంజయ్ హెచ్చరించారు.