home page sliderHome Page SliderInternationalNews

యూఎస్ కు షాక్‌: పాస్‌పోర్ట్ ర్యాకింగ్స్ లో 12 వ స్ధానం

అగ్రరాజ్యం అమెరికాకు పెద్ద షాక్ తగిలింది. ప్రపంచంలోని శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితాలో అమెరికా తన స్థానం కోల్పోయింది. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా అమెరికా టాప్-10 నుంచి దిగజారింది. తాజా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, అమెరికా ఇప్పుడు 12వ స్థానానికి పడిపోయింది. అమెరికా పాస్‌పోర్ట్ కలిగిన వారు ప్రస్తుతం కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించగలుగుతారు.
ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్ హోల్డర్లు 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించగలుగుతున్నారు. ఆ తర్వాత దక్షిణ కొరియా (190), జపాన్ (189) స్థానాల్లో ఉన్నాయి. అమెరికా ర్యాంక్ తగ్గడానికి పలు కారణాలు ఉన్నాయి. బ్రెజిల్, చైనా, మయన్మార్, పపువా న్యూగినియా, వియత్నాం, సోమాలియా వంటి దేశాలు అమెరికా పౌరులపై వీసా ఆంక్షలు విధించాయి.
ఇదే సమయంలో, అమెరికా ఇతర దేశాల పౌరులను వీసా రహితంగా అనుమతించడంలో వెనుకబడింది. ప్రస్తుతం, అమెరికా కేవలం 46 దేశాల పౌరులకు మాత్రమే వీసా మినహాయింపు ఇస్తోంది. ఫలితంగా హెన్లీ ఓపెన్‌నెస్ ఇండెక్స్‌లో అమెరికా 77వ స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా, చైనా తన స్థితిని బాగా మెరుగుపరుచుకుంది. గత 10 సంవత్సరాల్లో చైనా ర్యాంక్‌ను 94 నుంచి 64కు మెరుగుపరిచింది. ఇప్పుడది 76 దేశాల పౌరులకు వీసా మినహాయింపు ఇస్తోంది. ఓపెన్‌నెస్ ఇండెక్స్‌లో చైనా 65వ స్థానంలో నిలిచి, అమెరికాను అధిగమించింది. ఈ పరిణామాలు అమెరికా గ్లోబల్ ఇమేజ్‌పై ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.