విశాఖపట్నంలో తొలి గూగుల్ ఏఐ హబ్ – ఏపీకి చారిత్రక ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ కేంద్రంగా మారనుంది. విశాఖపట్నంలో దేశంలోని తొలి గూగుల్ ఏఐ హబ్ సెంటర్ ఏర్పాటుకు గూగుల్ – ఏపీ సర్కార్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగినట్లు అధికారికంగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా రూ.87,520 కోట్ల భారీ పెట్టుబడులతో ఒక గిగా వాట్ సామర్థ్యం గల డేటా సెంటర్‌ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. 2029 నాటికి ఈ కేంద్రాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 1.88 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి.
వైద్య, విద్య, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాల్లో సేవలందించనున్న ఈ డేటా సెంటర్ విశాఖ నుంచి సింగపూర్, మలేసియా, ఆస్ట్రేలియా వంటి 12 దేశాలకు సబ్‌సీ కేబుల్ ద్వారా అనుసంధానం కానుంది. ఇది అమెరికా వెలుపల గూగుల్ పెట్టుబడుల దృష్టిలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలవనుందని గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈవో థామస్ కురియన్ తెలిపారు. జెమినీ-ఏఐ సహా ఇతర గూగుల్ సేవలు ఈ కేంద్రం ద్వారా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు , సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను తీసుకొచ్చాం, ఇప్పుడు విశాఖకు గూగుల్‌ను తీసుకువస్తున్నాం,” అన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ఏఐ, డేటా కలెక్షన్ కీలకంగా మారిన ఈ యుగంలో ఏపీను టెక్నాలజీ మెకా గా మార్చే దిశగా ఇది ఒక మైలు రాయి అని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్టులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని సీఎం ధన్యవాదాలు తెలిపారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ ఒప్పందాన్ని “ల్యాండ్‌మార్క్”గా అభివర్ణించగా, “వికసిత్ భారత్” లక్ష్యంలో భాగంగా ఏఐ రంగంలో కీలక అడుగుగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.