మెక్సికోలో తుఫాను బీభత్సం: 44 మంది మృతి
మెక్సికో మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో తుఫాను ఉధృతి తీవ్రంగా విరుచుకుపడింది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు ప్రాణాంతకంగా మారి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వందలాది మంది ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు.
వెరాక్రుజ్ రాష్ట్రంలో అక్టోబర్ 6 నుంచి 9 వరకు అత్యధికంగా 54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కజొనెస్ నది ఉప్పొంగి, తీరప్రాంతాల్లోని గ్రామాలు వరద ముంపుకు గురయ్యాయి. శుక్రవారం వేకువజామున పొజారికా నగర వీధుల్లో నాలుగు మీటర్ల లోతులో నీరు ప్రవహించింది. వందలాది గృహాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
తుపాను ధాటికి బురదలోనే జీవనం కొనసాగిస్తున్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహారం, తాగునీరు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని పరిశీలించేందుకు నగర మేయర్ అక్కడికి చేరుకున్నారు. కానీ సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని, ముందస్తు హెచ్చరికలు ఇవ్వలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేయర్ కార్ ఊరేగుతూ వస్తుండగా స్థానికులు వాహనంపై రాళ్లు రువ్వి, బురద చల్లారు. “మమ్మల్ని ముందుగా ఎందుకు హెచ్చరించలేదు? ఇప్పుడు ఎందుకు వస్తున్నారు?” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
వర్షాల కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం, రహదారులు కూలిపోవడం వంటి ఘటనలు దేశంలో అనేక ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. రక్షణ సిబ్బంది మృతదేహాలను వెలికితీస్తూ, చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు శ్రమిస్తున్నారు.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పరిస్థితిని సమీక్షించి, తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాల గవర్నర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా “ప్రభుత్వం ప్రజల ప్రాణరక్షణకు ప్రాధాన్యత ఇస్తోంది. అన్ని శాఖలు సహాయక చర్యల్లో పాల్గొనాలి” అని ఆమె ఆదేశించారు.
ప్రస్తుతం వెరాక్రుజ్, ప్యూబ్లా, టబాస్కో, చియాపాస్ రాష్ట్రాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రోడ్లపై పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన వంతెనలు రవాణా వ్యవస్థను దెబ్బతీశాయి.
వాతావరణ శాఖ మరోసారి హెచ్చరిస్తూ, తీరప్రాంతాల్లో తీవ్ర వర్షాలు, గాలులు కొనసాగే అవకాశం ఉందని ప్రకటించింది. ఇంకా పలు నదులు పొంగిపోవచ్చని, ప్రాణనష్టం ఇంకా పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
తుపాను బీభత్సం కారణంగా మెక్సికోలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక మానవ నష్టం ఇదేనని విపత్తు నిర్వహణ సంస్థలు పేర్కొన్నాయి.