కల్తీ మద్యం కేసులో 23 మంది నిందితులను గుర్తింపు
అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీ మద్యం ఘటనలో ఇప్పటి వరకు గుర్తించామని, వారిలో 14 మందిని అరెస్టు చేశామని ఎక్సైజ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం మీడియా సమావేశంలో శనివారం వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న జనార్దన్‌రావును ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు.
కల్తీ మద్యం కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. హైదరాబాద్, బెంగళూరుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఈ బృందాలు విచారణ కొనసాగిస్తున్నాయి. మిగిలిన నిందితులందరినీ త్వరలోనే అదుపులోకి తీసుకుంటాం అని చెప్పారు.అలాగే, ప్రతి మద్యం బాటిల్‌పై ప్రత్యేక కోడ్ ద్వారా అది ఎక్కడ తయారైంది, ఎక్కడికి తరలించబడింది, ధర ఎంత వంటి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. త్వరలోనే ఏపీటాట్స్ యాప్ ద్వారా ప్రజలకు ఆ వివరాలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి వెల్లడించారు. రూ.99కే నాణ్యమైన మద్యం అందిస్తున్నాం. నవోదయ కార్యక్రమం ద్వారా నాటుసారా తయారీని పూర్తిగా అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. మిగతా జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం త్వరలో పూర్తి అవుతుంది. మద్యం కేసుల్లో అరెస్టయినవారు ఇప్పుడు బయటకొచ్చి మద్యంపై మాట్లాడటం సిగ్గుచేటు అని విమర్శించారు.
తమ పార్టీకి చెందిన ఒక నేత ఈ కేసులో ఉన్నాడని తెలిసిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, కానీ గతంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
అనారోగ్యంతో మరణించిన నలుగురిని కల్తీ మద్యం వల్ల చనిపోయారని వైసీపీనేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లు మాత్రమే ఇచ్చినా, ఇంకా వారిలో సిగ్గు రాలేదు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం. తప్పు చేసిన అధికారులపైనా, ఎంతటి స్థాయి వారైనా, చర్యలు తప్పవు అని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.