అఫ్గాన్ లో భారత కాబుల్ మిషన్ పునరుద్ధరణ
భారత్ – అఫ్గానిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించింది. 2021 ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్ తిరిగి అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్ల విరామం తర్వాత, ఇప్పటి వరకు కేవలం “టెక్నికల్ మిషన్”గా నడుస్తున్న కాబూల్ కార్యాలయాన్ని, ఇప్పుడు పూర్తిస్థాయి రాయబార కార్యాలయంగా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు.
మరోవైపు, తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీతో న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన సమావేశంలో నిర్వహించారు. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత అధికారులు అఫ్గాన్‌ను వదిలి వెళ్ళిన సంగతి తెలిసిందే. అప్పుడు సీ-17 విమానాల్లో భారత సిబ్బందిని అత్యవసరంగా వెనక్కి తీసుకువచ్చారు. రాయబార కార్యాలయం కార్యకలాపాలు తగ్గించి, కాన్సులేట్లు మూసివేశారు.
అయితే, గత ఏడాది నుండి తాలిబన్ ప్రభుత్వం ఢిల్లీ మధ్య సంబంధాలు క్రమంగా మెరుగుపడుతున్నాయి. కేంద్ర మంత్రి జైశంకర్‌తో సమావేశంలో ముత్తాఖీ ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. భారత్‌పై ఉగ్రదాడుల కోసం తమ భూభాగాన్ని ఉపయోగించడానికి తాలిబన్ అనుమతించదని, ముత్తాఖీ హామీ ఇచ్చారు. ఇది పాక్ ఉగ్రవాదం నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాక్ ఆధారిత ఉగ్రవాదులు అఫ్గాన్ సరిహద్దు ప్రాంతాల్లో దాడులు జరిపిన నేపథ్యంలో తాలిబన్ ప్రకటన కీలకంగా మారింది. 2024 జనవరిలో పాక్ జరిపిన దాడుల్లో 45 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈనేపధ్యంలో భారత్ స్పందనపై ముత్తాఖీ ప్రశంసలు కురిపించారు. 2024 ఆగస్టులో సంభవించిన భారీ భూకంపం సమయంలో, భారత ప్రభుత్వం తొలుత స్పందించి తక్షణ సహాయం అందించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ భూకంపంలో 2000 మందికిపైగా మృతి చెందగా, 5000 ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఈ పరిణామాలతో, నాలుగేళ్ల విరామం తర్వాత భారత్ అఫ్గాన్‌తో సంబంధాలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడం దౌత్యపరంగా కీలక అడుగుగా పరిగణించబడుతోంది. ఇది ద్వైపాక్షిక సహకారానికి, ప్రాంతీయ భద్రతకు, ఉగ్రపోరుపై వ్యతిరేక చర్యలకు బలమైన సంకేతంగా నిలిచే అవకాశం ఉంది.

