బీసీలకు రిజర్వేషన్లు ఒక సామాజిక విప్లవం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం దేశ చరిత్రలోనే ఒక సామాజిక విప్లవమని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం జరిగిన పార్టీ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, బీసీలకు అధిక రిజర్వేషన్లు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేశాయని తెలిపారు. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లో బలంగా ప్రచారం చేయాలని సూచించారు.
అదేవిధంగా, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు నేడు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఆయన తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు అత్యంత సీరియస్‌గా తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ‘ఓట్ చోరీ’ అంశంపై ఏఐసీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. అక్టోబర్ 15 నాటికి తెలంగాణ వ్యాప్తంగా సంతకాల సేకరణ పూర్తి చేసి ఏఐసీసీకి పంపాలని సూచించారు. ప్రతి గ్రామంలో కనీసం 100 సంతకాల సేకరణ చేయాలని, డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

