Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

ఆర్ అండ్ బీ రోడ్లను అద్దంలా తయారుచేస్తాం

రాష్ట్రంలో రాబోయే మూడు సంవత్సరాల్లో ఆర్ అండ్ బీ (R&B) రోడ్లను అద్దంలా తయారు చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. సచివాలయంలో హ్యామ్ రోడ్ల నిర్మాణంపై గురువారం నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా నిలపాలనే లక్ష్యంతో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. యాక్సిడెంట్‌లేని రోడ్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని చెప్పారు. దశల వారీగా హ్యామ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేసిన ఆయన, మొదటి దశలో రూ.10,986 కోట్ల వ్యయంతో 5,587 కి.మీ. మేర హ్యామ్ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. అన్ని మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో డబుల్ లేన్ రోడ్ల ద్వారా, జిల్లా కేంద్రాలను రాష్ట్ర రాజధానితో నాలుగు లేన్ రోడ్ల ద్వారా అనుసంధానించాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని, అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల మధ్య కనెక్టివిటీ కారిడార్లుగా హ్యామ్ రోడ్లు నిర్మించనున్నామని చెప్పారు. ఫస్ట్ ఫేజ్ పనులకు గాను వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నట్లు ప్రకటించిన మంత్రి, రోడ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు కృతజ్ఞతలు తెలిపారు.