home page sliderHome Page SliderInternationalNationalNewsviral

భారత్ త్వరలోనే మూడో ఆర్థిక వ్యవస్థగా మారనుంది

బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ఇటీవల భారతదేశాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన భారత్‌ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదగనున్నదని పేర్కొన్నారు. ఆయన గురువారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ముంబయిలోని రాజ్‌ భవన్‌ లో ఇరు దేశాధినేతలు సమావేశం జరిపారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టార్మర్‌ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలను ప్రశంసించారు. ఈ ప్రయాణంలో తామూ భాగస్వామిగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు.
‘‘భారత్‌ ఇటీవలే జపాన్‌ను అధిగమించి నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2028 నాటికి మూడో ఆర్థికశక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ నాయకత్వానికి అభినందనలు. ఇక్కడికొచ్చి ఈ పరిస్థితులు చూస్తుంటే మీరు లక్ష్యాన్ని చేరుకునే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ప్రయాణంలో మేమూ భాగం కావాలనుకుంటున్నాం. వికసిత్‌ భారత్‌ స్ఫూర్తితో 2047 నాటికి పూర్తి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తోందన్న నమ్మకం ఉంది’’ అని కీర్‌ స్టార్మర్‌ ప్రశంసించారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్‌ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలో రష్యా, భారత్‌..వాటి డెడ్‌ ఎకానమీలను మరింత దిగజార్చుకునే అవకాశముందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు భారత్‌ ఇదివరకే దీటుగా బదులిచ్చింది. తాజాగా యూకే ప్రధాని కూడా ట్రంప్‌ వ్యాఖ్యలను పరోక్షంగా ఉద్దేశిస్తూ ఇలా కౌంటర్‌ ఇచ్చారు. భారత్‌-యూకే మధ్య తాజా వాణిజ్య ఒప్పందం గురించి కూడా కీర్‌ స్టార్మర్‌ ప్రస్తావించారు. ఇరు దేశాల సంబంధాల్లో ఆ డీల్‌ ఓ చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు. అంతేగాక, నాణ్యమైన ఉన్నత విద్యకు ఈ రోజుల్లో డిమాండ్‌ పెరుగుతోందని, అందుకే భారత్‌ లో మరిన్ని బ్రిటిష్‌ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సాంకేతికత, సృజనాత్మకత, కృత్రిమమేధలో భారత్‌, యూకేలు పరస్పరం సహకారం అందించుకుంటాయని తెలిపారు.