టాటా గ్రూప్ కు కేంద్రం కీలక సలహాలు
ప్రతిష్టాత్మక టాటా గ్రూప్ పలు అంతర్గత వివాదాలలో చిక్కుకుంది. దీనితో కేంద్ర ప్రభుత్వం పలు కీలక సలహాలు అందించినట్లు సమాచారం. బోర్డు నియామకాల్లో.. పాలనా అంశాల్లో టాటా ట్రస్టీల మధ్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సమస్యను పరిష్కారం కోసం కేంద్రం రంగంలోకి దిగింది. టాటా గ్రూప్ ముఖ్యులతో హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. ఈ వివాదాన్ని అంతర్గతంగా పరిష్కరించుకోవాలని, అవసరమైతే ఇలాంటి సమస్యలకు కారణమయ్యే ట్రస్టీని తొలగించే అంశాన్ని కూడా పరిశీలించాలని వారు సూచించినట్లు సమాచారం. టాటా గ్రూప్ బోర్డురూమ్ వివాదం టాటా సన్స్, ఇతర గ్రూప్ కంపెనీల మేనేజ్‌మెంట్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొన్నట్లు సమాచారం.
‘‘ఎలాంటి చర్యలు చేపట్టయినా సరే టాటా ట్రస్ట్స్‌లో స్థిరత్వాన్ని పునరుద్ధరించాలి. అంతర్గత వివాదాలు టాటా సన్స్ కార్యకలాపాలను ప్రభావితం చేయకూడదు. అవసరమైతే గ్రూప్ లో గొడవలకు కారణమయ్యే ట్రస్టీని తొలగించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. టాటా సన్స్ లో టాటా ట్రస్ట్స్‌ల వాటా ప్రజా బాధ్యతతో వచ్చింది. భారత ఆర్థికవ్యవస్థకు టాటా గ్రూప్ సహకారం చాలా ముఖ్యమైనది. అందువల్ల కంపెనీలో ఎలాంటి వివాదమైనా సరే దాన్ని అంతర్గతంగా, వివేకంతో పరిష్కరించుకోవాలి’’ అని కేంద్రమంత్రులు టాటా ప్రతినిధులకు సూచించినట్లు కొన్నికథనాలు వెల్లడించాయి.
ఈ సమావేశం తర్వాత టాటా ప్రతినిధులు కూడా అంతర్గతంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, టాటా గ్రూప్ ప్రధాన సంస్థ టాటాసన్స్‌లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ తన వాటాల్లో కొంత విక్రయించుకునేందుకు టాటా ట్రస్ట్స్, టాటా సన్స్ అంగీకరించినట్లు సమాచారం. టాటా సన్స్ లో టాటా ట్రస్ట్స్‌కు 66శాతం వాటా ఉంది. అయితే, ఈ ట్రస్ట్ బోర్డులో టాటా, షాపూర్జీ పల్లోంజీ వర్గాల ట్రస్టీల మధ్య బేదాభిప్రాయాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి.