కాళేశ్వరంపై విచారణ వాయిదా
కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీ చంద్రఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా తమపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీబీఐ దర్యాప్తు నిలిపివేయాలని మాజీ సీఎం కేసీఆర్ , మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకొవద్దిన రిటైర్డు ఐఏఎస్ ఎస్కే జోషి , ఐఏఎస్ స్మృతి సబర్వాల్ కూడా హైకోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలోనే అన్ని పిటిషన్లపై సీజే అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ద్విసభ్య ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది. కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది.
కాగా, అంతుకు ముందు కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. కేసీఆర్, హరీశ్‌రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని కోర్టుకు తెలిపారు. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక, విచ్చిన వివిధ ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేపడుతుందని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ పిటిషన్‌పై లోతైన విచారణ జరపాల్సి ఉందని అభిప్రాయపడింది. వెకేషన్ తరువాత కేసుపై విచారణ చేపడతామని.. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.