అస్సాం గాయకుడి మృతి కేసులో కీలక మలుపు
ఇంటర్నెట్ డెస్క్: అస్సాంకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అతని మరణానికి కారణమైన వారిని వదిలేది లేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. ఆయన మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్ ఇళ్లలో ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు నిర్వహించింది. అలాగే సౌండ్ రికార్డిస్ట్ నివాసంలోనూ తనిఖీలు జరిగాయి. అలాగే మ్యుజీషియన్ శేఖర్ జ్యోతి గోస్వామిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన్ను విచారించనున్నారు. జుబీన్ మరణానికి ముందు ప్రయాణించిన నౌకలో ఉన్న బృందంలో గోస్వామి కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ అరెస్టు విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. గాయకుడు జుబీన్ గార్గ్ ఇటీవల సింగపూర్లో ప్రమాదవశాత్తూ మృతి చెందారు. ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ ఈ కేసు విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నా’’ అని ఎక్స్ వేదికగా ప్రకటించారు.