ఉద్యోగులకు కూటమి షాక్..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం మరోసారి నిరాశ కలిగించింది. అసెంబ్లీ వేదికగానే ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ అంశంపై ప్రభుత్వం తేలికగా వ్యవహరించిందని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్, అకేపాటి అమర్నాథ్ రెడ్డి, విరూపక్ష ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉద్యోగుల పీఆర్సీ ఎప్పుడు అమలు చేస్తారు? ఐఆర్ ఎప్పుడు ఇస్తారు? డీఏ బకాయిలు ఎప్పట్లో చెల్లిస్తారు? అనే ప్రశ్నలు లేవనెత్తారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే ఆయన సమాధానం ఉద్యోగులకు నిరాశ కలిగించేలా ఉన్నాయి . “పీఆర్సీ, ఐఆర్ అంశం పరిశీలనలో ఉంది” అని మాత్రమే చెప్పారు. ఎప్పుడు ఇస్తారు? ఎంత ఇస్తారు? అన్న విషయాలను పూర్తిగా దాటవేశారు.
ఇదే సమయంలో డీఏ బకాయిల విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం రూ.12,119 కోట్లు చెల్లించాల్సి ఉందని అంగీకరించింది. అయితే ఆ మొత్తాన్ని ఎప్పుడు విడుదల చేస్తారో మంత్రి వివరించలేదు.ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. “అసెంబ్లీ సాక్షిగా మళ్లీ మమ్మల్ని మోసం చేశారు. హామీలను నెరవేర్చకపోవడమే కాకుండా, ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదు” అని ఉద్యోగ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మొత్తానికి, ఐఆర్, పీఆర్సీ, డీఏ బకాయిల అంశంలో స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి తీవ్ర నిరాశకు గురయ్యారు.