బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది
బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని , బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి,బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు . హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ , బీసీ బిల్లు గురించి కేంద్రాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఎప్పుడు అడగలేదని విమర్శించారు.కాంగ్రెస్ నేతలు మొదట చట్ట సవరణ అన్నారని.. తర్వాత ఆర్డినెన్స్.. ఇప్పుడు జీవో అంటున్నారన్నారు. బిల్లుల పేరుతో బీసీలను అవమానిస్తే ఊరుకునేది లేదని చెప్పారు. 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలు అడగకపోయినా.. కాంగ్రెస్ పార్టీయే హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. రిజర్వేషన్ల అమలుపై ఆ పార్టీ మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
‘‘ఈ అంశం విద్య, ఉద్యోగాల్లో లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉంది. జీవో ఇచ్చి కేవలం రాజకీయ పదవులకే సరిపెడితే ఊరుకునేది లేదు. రాజకీయ పదవుల్లోనూ బీసీలకు పూర్తి న్యాయం చేయలేదు. బిల్లు ఆమోదం కోసం దిల్లీలో ధర్నాలు చేశారు. కానీ.. ఎవరినీ అడగలేదు. విజయోత్సవ సభ పెడుతున్నామని ఎందుకు వెనక్కి తగ్గారు?’’ అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు