Breaking NewsHome Page Sliderhome page sliderNewsPoliticsTelanganaTrending Todayviral

జీఎస్టీ పేరుతో పేదల రక్తం తాగుతున్నారు

జీఎస్టీ పేరుతో పేదల రక్తం తాగుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్రం పై ఆరోపణలు చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆందోళన వ్యక్తం చేశారు . ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటనలు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయని ఆయన విమర్శించారు. జీఎస్టీని మొదట ఆయుధంగా వాడి దేశ ప్రజల రక్తం పీల్చుకున్న తర్వాత, ఇప్పుడు పన్నులు తగ్గించి సంబరాలు చేసుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు.

గత ఎనిమిది ఏళ్లుగా జీఎస్టీ పేరుతో పేదల రక్తం తాగి, ఇప్పుడు పేదలకు లబ్ధి చేసినట్టు బీజేపీ నేతలు ప్రచారం చేయడం ఎన్నికల డ్రామా తప్ప మరేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. జీఎస్టీ శ్లాబుల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయని, పేదవాడి భారం మరింత పెరిగిందని ఆయన ఎత్తి చూపారు. “జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్” అని రాహుల్ గాంధీ అప్పుడే చెప్పారని గుర్తు చేస్తూ, ఆ సమయంలో రేట్లు తగ్గించాలని ఆయన చేసిన డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదని అన్నారు.

జీఎస్టీ 18, 24 శ్లాబుల్లో ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను చేర్చి, లగ్జరీ వస్తువులపై మాత్రం తక్కువ పన్ను విధించడం అన్యాయమని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీలో చేర్చాలని రాష్ట్రాలు కోరినా, కేంద్రం ఇప్పటికీ పట్టించుకోలేదని దుయ్యబట్టారు. అంతేకాకుండా శవపేటికలు, పసిపిల్లల ఆహార పదార్థాలపైనా జీఎస్టీ వసూలు చేయడం అమానుషమని మండిపడ్డారు.

జీఎస్టీ మార్పులు అమలులోకి వచ్చినా, మార్కెట్‌లో పాత ధరలకే వస్తువులు విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, దీని ప్రయోజనం పేదవాడికి ఏ మేరకు అందుతుందో చూడాల్సి ఉందని అన్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికే కేంద్రం జీఎస్టీ తగ్గింపుపై వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు.

ఈ మార్పుల వల్ల తెలంగాణకు రూ.7 వేల కోట్ల నష్టం వస్తోందని, దీన్ని పూడ్చే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఈ నష్టాన్ని ఎలా పూడ్చుతారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్‌లో కేంద్రానికి ఎక్కువ అధికారం ఉండడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీన్ని సవరిస్తూ రాష్ట్రాలకు సమాన హక్కులు ఇవ్వాలని ఆయన కోరారు.

జీఎస్టీ తీసుకొచ్చినప్పుడు 10 సంవత్సరాల పాటు రాష్ట్రాల నష్టాన్ని భర్తీ చేస్తామని కేంద్రం ఇచ్చిన హామీ పూర్తిగా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తెలంగాణకు కలిగిన రూ.7 వేల కోట్ల నష్టానికి ఎంత పరిహారం ఇస్తారో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.