పేదల ఇళ్ళు కూల్చడం ఆపాల్సిందే
సీఎం రేవంత్ పేదల ఇళ్ళు కూల్చడం ఇకనైనా ఆపాలని ఈటల రాజేందర్ అన్నారు . పేదల జోలికి వస్తే మాడి మసి అవుతారని హెచ్చరించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గలోని గాజులరామారంలో ఎంపీ ఈటల పర్యటించారు. హైడ్రా కూల్చిన ఇళ్లను పరిశీలించిన ఆయన బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ దేవుడు ఎరుగు 40 ఏళ్లుగా ఇక్కడే బ్రతుకుతూ.. పని చేసి బతికే పేదవారి ఇల్లు కూల్చారని మండిపడ్డారు. దేశం ఇంకో దేశం మీద దాడి చేసినట్టు దొంగ దెబ్బ తీసినట్టు.. పదుల సంఖ్యలో జేసీబీలు పెట్టి ఆదివారం వచ్చి కళ్ళ ముందు ఇల్లు కూలగొట్టారని అన్నారు. పిల్లల పుస్తకాలు, ఇంట్లో సామాన్లు తొక్కించారు. కన్నీళ్లు పెట్టుకుని బాధ పడిన కనికరించలేదని నిజాం రాజ్యంలో కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తించ లేదని మండిపడ్డారు. హైడ్రా మీకు దమ్ముంటే ప్రభుత్వం స్థలంలో బిల్డర్లు, నాయకుల ఆక్రమణలు తొలగించాలని సవాల్ చేశారు.
బ్రోకర్లు ఉంటే అరెస్ట్ చేయాలని, వారి నుంచి డబ్బులు రికవరీ చేయాలని అన్నారు. కానీ పేదల జీవితాలతో ఆడుకోవద్దని, వారి మీద ప్రతాపం చూపొద్దన్నారు. ఇదేనా నీ ఇందిరమ్మ రాజ్యం.. రూ. 2500 ఇవ్వలేదు.. డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు కానీ ఉన్న గూడు పడగొడుతున్నారని సీఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం వెంటనే కూలగొట్టిన వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ప్రభుత్వ భూములు పేదలకు దక్కాలని డిమాండ్ చేశారు.