Breaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTelanganaviral

జీఎస్టీ సంస్కరణల వల్ల తెలంగాణకు నష్టం

హైదరాబాద్‌: జీఎస్టీ సంస్కరణల వల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం వస్తుందని సీఎం రేవంత్ అన్నారు . దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన జీఎస్టీ సంస్కరణలపై సోమవారం మీడియా సమావేశం లో ముఖ్యమంత్రి స్పందించారు. కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రానికి దాదాపు రూ.7 వేల కోట్ల ఆదాయం తగ్గిందని, ఈ నష్టాన్ని కేంద్రం భర్తీ చేయాల్సిన బాధ్యత వుందని ఆయన డిమాండ్ చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్రానికి కలిగే నష్టంపై నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. 14 శాతం ఆదాయం తగ్గిన రాష్ట్రాలకు గతంలో వయబులిటీ గ్యాప్ ఫండ్ ఇచ్చినట్లే ఇప్పుడు కూడా కేంద్రం అదే విధానం పాటించాలన్నారు. రాష్ట్రాలపై భారం మోపి, “మీ సమస్య మీరే చూసుకోండి” అన్నట్టుగా మోడీ వ్యవహరించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక నష్టాన్ని ప్రధానికి వివరించి, పూడ్చే చర్యలు తీసుకోవాలని రేవంత్ కోరారు.
సింగరేణి బోనస్ పెంపు
హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించారు. సింగరేణి మొత్తం ఆదాయం రూ.6,394 కోట్లు కాగా, రూ.4,034 కోట్లు భవిష్యత్ పెట్టుబడుల కోసం కేటాయించామని తెలిపారు. నికర లాభం రూ.2,360 కోట్లు రావడంతో అందులో 34 శాతం అంటే రూ.819 కోట్లు శాశ్వత కార్మికుల బోనస్‌గా కేటాయించినట్లు వెల్లడించారు.
గతేడాది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,000 ఇచ్చిన బోనస్‌ను ఈసారి రూ.500 పెంచి రూ.5,500 అందిస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, దీపావళికి కూడా బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
సింగరేణి మనుగడపై ఆందోళన
గత బీఆర్ఎస్ పాలనలో సింగరేణి రెండు బ్లాక్‌లు కోల్పోయిందని, అవి ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లాయని రేవంత్ తెలిపారు. ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిన గనులను తిరిగి సింగరేణి కిందకు తెచ్చేలా కేంద్రంతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రైవేటు భాగస్వామ్యం పెరిగితే సింగరేణి భవిష్యత్ సవాలుగా మారుతుందని హెచ్చరించారు.
కార్మికుల పోరాటం తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిందని గుర్తుచేసిన సీఎం, భవిష్యత్‌లో కూడా కార్మికుల అండగా ఉంటామని హామీ ఇచ్చారు.