అసెంబ్లీ సాక్షిగా టీడీపీ,జనసేన తప్పుడు ప్రచారం బట్టబయలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్ర అప్పులపై వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థికమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇవ్వటంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ, జనసేన, వారి అనుకూల మీడియా “వైఎస్ జగన్ హయాంలో 10-14 లక్షల కోట్లు అప్పు చేశారని” ప్రచారం అసత్యమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ లిఖితపూర్వక సమాధానంతో తేలిపోయింది.
మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం, వైసీపీ పాలనలో కేవలం ₹2,61,683 కోట్ల అప్పులు మాత్రమే తీసుకున్నట్లు రికార్డు స్పష్టంచేసింది. 2024 జూన్ 12 నాటికి రాష్ట్ర మొత్తం అప్పు ₹5,19,192 కోట్లు ఉన్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోనుండి దిగిపోయే సమయానికి అప్పు ₹2,57,509 కోట్లు ఉన్నట్టు తెలిపారు. అదే సమయంలో, గత ఐదేళ్లలో వివిధ కార్పొరేషన్ల ద్వారా మరో ₹1,09,217 కోట్లు అప్పు తీసుకున్నట్టు మంత్రి వివరించారు. ఈ మొత్తాన్ని కలిపితే వైసీపీ పాలనలో తీసుకున్న అప్పులు మొత్తం ₹3,70,900 కోట్లుగా ఉన్నాయని స్పష్టంచేశారు. 2024 ఎన్నికల సమయంలో కూడా తీసుకున్న అప్పులు ఈ లెక్కల్లో చేర్చబడ్డాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కల్యాణ్ “జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని 10-14 లక్షల కోట్ల అప్పులోకి నెట్టింది” అనే ప్రచారం వాస్తవాలకు దూరమని అసెంబ్లీ సమాధానం బహిర్గతం చేసింది. దీంతో, కూటమి నేతల ఆరోపణలు అసత్యమని తేలి, నిజ నిజాలు ప్రజల ముందుకు వచ్చాయి.