అప్పుడు బీఆర్ఎస్ …ఇప్పుడు కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పోలీసులు మీద ఒత్తిడి తెస్తున్నారని, గతంలో బీఆర్ఎస్ ఏ విధంగా ప్రవర్తించిందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మార్గంలో నడుస్తోందని ఆరోపించారు. హిందువులను, హిందూ పండుగలను చులకన భావంతో చూస్తున్నారని మండిపడ్డారు.
నిజామాబాద్ కమిషనరేట్ సీపీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అర్వింద్, ఇటీవల నవీపేటలో గణపతిపై కాషాయ జెండా ఎగురవేశాడని ఒక యువకుడిపై ఆరోపణలు వచ్చాయని, ఆ ఫోటోను మసీదుపై పెట్టినట్లు చూపించి అతడిని వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారని చెప్పారు. కానీ ఆ తర్వాత ముస్లింలు బైక్ ర్యాలీ నిర్వహించి ఉద్రిక్తత సృష్టించినా వారిపై చర్యలు ఆలస్యంగా తీసుకున్నారని విమర్శించారు. జెండా ఎగురవేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు రాజస్థాన్‌కు చెందిన వాడని, అతడిని వెనక్కి పంపాలని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బంగ్లాదేశ్, మయన్మార్, టర్కీ నుంచి అక్రమంగా వచ్చిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తప్పు చేసిన వారిని శిక్షించడం సమంజసం కానీ మతం ఆధారంగా వర్గీకరణ చేస్తే సమాజంలో విభజన వస్తుందని హెచ్చరించారు.

