జూబ్లీహిల్స్ గెలుపుతో జైత్రయాత్ర మొదలుపెడదాం
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై రాష్ట్రము లోని ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి . ఈ ఎన్నిక అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జరిగే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ కార్యకర్తలతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ భార్య సునీత పాల్గొన్నారు.
కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మాగంటి గోపీనాధ్ సేవలు, ఆయన చూపిన ప్రజా మార్గం గురించి గుర్తుచేశారు. గోపీనాధ్ కలలు కన్న అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. మాగంటి సునీతకు ప్రజల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ను ఘన విజయంతో గెలిపించడం ద్వారా గోపీనాధ్ వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటీ అమలు చేయలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను డబ్బులు పంచి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ నేతలది అని ఎద్దేవా చేశారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడిన కేటీఆర్, సీఎం కుటుంబ సభ్యులు చెరువుల్లో ఇళ్లు కట్టినా ఎవరూ పట్టించుకోరని, కానీ పేదల బస్తీలలో మాత్రం ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆరోపించారు. పేదల సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతూ, ప్రాజెక్టులకు మాత్రం వందల కోట్లు వెచ్చిస్తున్నారని విమర్శించారు. ఉపఎన్నికలో పార్టీ గెలుపు కోసం సర్వేలు చేస్తున్నామని, నియోజకవర్గంలో పరిస్థితి బాగానే ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నామని గుర్తించారు. అందువల్ల కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మాగంటి సునీత మాట్లాడుతూ, తన భర్త కలలు కన్న అభివృద్ధి లక్ష్యాలను నెరవేర్చడానికి కార్యకర్తలందరూ తనకు అండగా నిలవాలని కోరారు. గోపీనాధ్ చూపిన దారిలో నడుస్తూ జూబ్లీహిల్స్ ప్రజలకు సేవ చేయాలన్నదే నా లక్ష్యమని ఆమె తెలిపారు .
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్‌ఎస్‌లో కష్టపడే కార్యకర్తలకు ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ను ఘన విజయంతో గెలిపిస్తామని, ఇకనుంచి పార్టీకి కొత్త జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని నమ్మకం వ్యక్తం చేశారు.