బీజేపీ అంటే భయమా…. అందుకేనా అరెస్టులు
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ అంటే ఇంత భయం ఎందుకని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. చేవెళ్లలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసినట్లుగానే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే బాటలో నడుస్తోంది” అని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తే బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి తమ వైఫల్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం కప్పిపుచ్చుకోవాలనుకుంటోందని ఆయన విమర్శించారు. “ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలు, కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు” అని మండిపడ్డారు. బండి సంజయ్ మాట్లాడుతూ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు అరెస్టయిన కార్యకర్తలు, కార్పొరేటర్లందరినీ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలనలో పెరుగుతున్న అరాచకాలు, అన్యాయాలు ప్రజలు గమనిస్తున్నారని, ఇక ఎక్కువ రోజులు ఈ తీరును సహించరని ఆయన వ్యాఖ్యానించారు.

