లక్షలమంది అనుమానాలకు సాక్ష్యాలివే: రాహుల్ గాంధీ
- . ఈసీ ఓట్ చోరీ పై రాహుల్ గాంధీ సంచలన ప్రెస్‌మీట్
- . ఈసీ ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించింది
- . ఆరు నెలల పాటు నకిలీ ఓట్లపై సమగ్ర అధ్యయనం
- . మహారాష్ట్రలో సాయంత్రం 5 తర్వాత భారీ ఓటింగ్
- . జనాభా కంటే ఓటర్ల సంఖ్యే ఎక్కువ
- . నకిలీ ఓట్లు, ఒకే వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాలలో ఓట్లు
- . బీహార్ లో లక్షలాది ఓట్ల తొలగింపు
- . ప్రీపోల్, పోస్ట్ పోల్ సర్వేలకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాలు

న్యూఢిల్లీ: ఓట్ చోరీ పేరిట గురువారం ఢిల్లీ ఇందిరా భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ, లోక్ భలో విపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. బీజేపీ కోసం ఈసీ ప్రజాస్వామ్య విరుద్ధంగా ఓట్ల చోరీకి పాల్పడుతోందని ఆరోపించారు. దాన్ని రుజువు చేసేందుకు తమ వద్ద అణు బాంబు లాంటి ఆధారాలున్నాయని ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ అక్రమాలకు పాల్పడిందని, బీజేపీ కోసం ఈసీ ఓట్లను చోరీ చేసిందని ఆరోపించారాయన. తన వద్ద గల ఆధారాలను మీడియా ముందు వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అనేక రాష్ట్రాల ఓటర్ల జాబితాలో నకిలీ వ్యక్తుల పేర్లు ఉన్నాయని ఆరోపించారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్క వ్యతిరేకంగా ఎన్నికల ఫలితాలు వస్తున్నాయని, హరియాణా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఫలితాలు తమ అనుమానాలకు బలం చేకూర్చాయని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన.. ఇందుకు సంబంధించి మీడియా సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. “మహారాష్ట్రలో ఐదు నెలల్లోనే 40 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారు. ఐదేళ్లలో నమోదైన వారి కంటే.. ఐదు నెలల్లో నమోదైన ఓటర్లే ఎక్కువ. మహారాష్ట్రలో లోక్ సభ, విధానసభ ఎన్నికల మధ్య సమయంలో కోటి మంది ఓటర్లు నమోదయ్యారు. ఓటర్ల జాబితా మాకు ఇచ్చేందుకు ఈసీ నిరాకరించింది. అది దేశ సంపద.. దానిని ఎందుకు చూపించట్లేదు” అని రాహుల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న తమ అనుమానం మహారాష్ట్ర ఫలితాలతో నిజమైందన్నారు. మెషిన్ రీడ్ చేయగల ఓటరు లిస్టును ఎన్నికల సంఘం ఇవ్వకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నారు. అటు కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5లక్షల ఓట్లకు గాను లక్ష ఓట్లు నకిలీవి, తప్పుడు చిరునామావేనని తమ పరిశోధనలో తేలిందని చెప్పారు. బీహార్ లో ఓట్ల తొలగింపులు, మహారాష్ట్రలో ఈసీ అక్రమాలపై సమాధానం చెప్పాలి. ఒకే పేరు, ఫోటో, ఒకే అడ్రస్ ఉన్న వ్యక్తికి వేర్వేరు రాష్ట్రాలలో ఓటు హక్కు ఉంది. ఇలాంటి ఓట్లు వేలల్లో ఉన్నాయి. సింగిల్ బెడ్రూమ్ ఇంటికి 48 ఓట్లు ఉండడం ఎంత హాస్యాస్పదం. ఇంటి నెంబర్ 0 తో కూడా ఓట్లు ఉన్నాయి. మహారాష్ట్ర జనాభా కంటే ఓట్లు ఎక్కువగా ఉండడం ఎలా సాధ్యమయ్యింది. సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ కేంద్రాల్లో జనం లేకపోయినా భారీ ఓటింగ్ ఎలా జరిగింది. బీహార్ లో లక్షల ఓటర్లను తొలగించారు. హర్యానా, మధ్య ప్రదేశ్ లలో కూడా అంచనాలకు భిన్నంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆరు నెలల పాటు సమగ్ర అధ్యయనం జరిపి లోతుగా సర్వేలు చేయించడం వల్ల ఈసీ వ్యవహారం మొత్తం బయటపడింది. ఇక ఎన్నికల సంఘం అబద్దాలతో మభ్యపెట్టలేదు. ఇది దేశద్రోహంతో సమానం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారిని వదిలిపెట్టం అంటూ హెచ్చరించారు రాహుల్ గాంధీ.