పిఠాపురం టీడీపీ నాయకుడు వర్మ రాజీనామా..?
పవన్ కళ్యాణ్ కూటమి పొత్తు మరో 15 సంవత్సరాల పాటు కొనసాగుతుందని ప్రకటించిన సందర్భంలో, పిఠాపురం నియోజకవర్గంలో ఆయన మరోసారి పోటీ చేయడం ఖాయమని, ఆయన అభ్యర్థిత్వానికి చంద్రబాబు నాయుడు మద్దతు ఇవ్వడం తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న వర్మ, తెలుగుదేశం పార్టీ పట్ల అనుమానంతో తన రాజకీయ భవిష్యత్తు గురించి ముందస్తుగా ఆలోచనలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల సమయంలో పార్టీ టికెట్ లభించకపోయిన వర్మ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 47,000 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ విజయానికి వర్మ ఎంతో శ్రమించి, ప్రాధాన్యత కలిగిన పాత్ర పోషించారు. అయినప్పటికీ, ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత వర్మను పూర్తిగా పక్కన పెట్టినట్టు స్పష్టమవుతోంది. వర్మకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రభావం తగ్గిపోతుందన్న ఆలోచన పార్టీ వర్గాల్లో ఉండవచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదే సందర్భంలో పిఠాపురంలో నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ నాగబాబు చేసిన వ్యాఖ్యలు—”మేము గెలవడం ఎవరి దయ వల్ల కాదు, పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్న ఇమేజ్ వల్లే సాధ్యమైంది”. నాగబాబు వ్యాఖ్యల కారణంగా ..వర్మకు ప్రాధాన్యత తగ్గినట్టు భావించి .. తన రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనతో రాజీనామా చేశారని ఆయన అనుచరులు భావిస్తున్నారు.