ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు
వికారాబాద్ జిల్లా పరిగిలోని తుంకులగడ్డలో నిర్మించబోతున్న ‘యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల’కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, అందుకోసం కోటిన్నర రూపాయలతో అధునాతన వసతులతో కూడిన సమీకృత పాఠశాలలను నిర్మిస్తున్నామని తెలిపారు. కులాలకతీతంగా అందరికీ సమాన విద్యా అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. ఇక నూతనంగా నిర్మించబోయే గురుకుల పాఠశాల కార్పొరేట్ స్థాయి వసతులతో అందించబడుతుందని మంత్రి తెలిపారు. రైతులకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. పరిగి ప్రాంతానికి సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిల దృష్టికి తీసుకెళ్లి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చిస్తానని తెలిపారు.

