BusinessHome Page SliderNewsPoliticsTelanganatelangana,

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని జీనోమ్ వ్యాలీలో “ఐఖోర్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్” విస్తరణలో భాగంగా 1.75 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త ప్లాంట్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఫెసిలిటీ ద్వారా 800 మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని తెలిపారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్ రంగం 23 శాతం వార్షిక వృద్ధి రేటుతో (CAGR) వేగంగా అభివృద్ధి చెందుతుండగా, జాతీయ సగటు కేవలం 14 శాతమేనని మంత్రి వివరించారు. రాష్ట్ర జీఎస్టీపీలో లైఫ్ సైన్సెస్ రంగపు వాటా 2.5 శాతం నుంచి 3 శాతానికి పెరిగిందని తెలిపారు.

బీఆర్ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ – 2025 ప్రకారం, బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, టోక్యో వంటి ప్రముఖ నగరాల సరసన హైదరాబాద్ స్థానం దక్కించుకోవడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి అన్నారు. దేశంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక నగరం హైదరాబాద్ అని పేర్కొన్నారు. 2024లో హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ సంస్థలు 2.4 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం, గత ఏడాది కంటే అది గణనీయంగా పెరిగిన అంశం అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా హైదరాబాద్–నాగ్‌పూర్, హైదరాబాద్–బెంగళూరు కారిడార్లలో ఫార్మా విలేజీల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు.

అధునాతన బయో మాన్యుఫాక్చరింగ్ , సెల్ అండ్ జీన్ థెరపీ, ఏఐ ఆధారిత డయగ్నస్టిక్స్, అరుదైన వ్యాధులపై పరిశోధన, గ్రీన్ కెమిస్ట్రీ, CRAMS వంటి విభాగాల్లో తెలంగాణను ప్రపంచ పటంలో ముందుండేలా చేయడమే తమ దృష్టి అని మంత్రి స్పష్టం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తూ, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలంటూ పిలుపునిచ్చారు. వారికి అన్ని విధాలుగా ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.