Home Page SliderNews AlertPoliticsTelanganatelangana,

మూడు నెలల జీతం ఒకేసారి… ఆనందంలో ఉద్యోగులు

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల (MPW) కోసం రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. గత మూడు నెలలుగా జీతాలు లేని కారణంగా ఆర్థికంగా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న వారికి ఒకేసారి మూడు నెలల జీతాలను విడుదల చేస్తూ రూ.150 కోట్లను మంజూరు చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలల జీతాలు రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో జమకాబోతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 53 వేల మందికి పైగా MPW లకిది ఎంతో ఊరటనిచ్చే నిర్ణయంగా నిలుస్తోంది. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ వంటి కీలక పనుల్లో ఈ ఉద్యోగుల పాత్ర కీలకమైనది. అయితే సకాలంలో జీతాలు అందకపోవడం వల్ల వాళ్లు బిల్లులు చెల్లించలేక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక, ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. ఇటువంటి పరిస్థితే పునరావృతం కాకుండా భవిష్యత్తులో జీతాలు క్రమం తప్పకుండా చెల్లించే విధంగా ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.