మధ్యతరగతికి గుడ్ న్యూస్..
మధ్యతరగతి వేతన జీవులకు ఆదాయపు పన్ను పరిమితిని రూ.12 లక్షలకు అమాంతం పెంచి ఊరట కల్పించిన కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. మధ్య తరగతి, తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు ఎక్కువగా వినియోగించే వస్తువులపై జీఎస్టీ (GST) తగ్గించాలని చూస్తోంది. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న జీఎస్టీ శ్లాబును పూర్తిగా తొలగించడం లేదా 12 శాతంలో ఉన్న చాలావరకు వస్తువులను 5 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలోకి తీసుకురావడమో చేయాలని కేంద్రం చూస్తోంది. తద్వారా వారిపై భారం తగ్గించాలని భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. పేద, మధ్యతరగతి ఎక్కువగా వినియోగించే టూత్ పేస్టు, టూత్ పౌడర్, గొడుగులు, కుట్టుమిషన్లు, ప్రెజర్ కుక్కర్లు, వంటగదిలో వినియోగించే పాత్రలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్లు, సైకిళ్లు, రూ.1000 పైబడిన రెడీమేడ్ దుస్తులు, ఫుట్ వేర్, స్టేషనరీ వస్తువులు, వ్యాక్సిన్లు, సిరామిక్ టైల్స్, వ్యవసాయ ఉపకరణాలు వంటివి జీఎస్టీ తగ్గించాలని భావిస్తున్న వస్తువుల జాబితాలో ఉన్నాయి. ప్రతిపాదిత వస్తువులపై జీఎస్టీ తగ్గిస్తే అవి తక్కువ ధరకే పేద, మధ్యతరగతి వర్గాలకు లభిస్తాయి. కేంద్రం తీసుకోబోయే ఈ నిర్ణయం వల్ల ఖజానాపై రూ.40వేల నుంచి రూ.50వేల కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. అయితే, ఆయా ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గించడం ద్వారా వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుంది. పన్ను పరిధి పెరగడంతో పాటు దీర్ఘకాలంలో జీఎస్టీ వసూళ్లు కూడా పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దిగువ, మధ్య తరగతికి ఊరట కల్పించే దిశగా జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరించాలని భావిస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. ఈ నిర్ణయాలు తీసుకోవాలంటే జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం సాధించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరులో జీఎస్టీ మండలి సమావేశం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.