నష్టపరిహారం పై సిగాచి కంపెనీ కీలక ప్రకటన…
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కంపెనీలో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. ఈ ఘటనలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు, 33 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి స్టాక్ మార్కెట్‌కు లేఖ రాసిన కంపెనీ సెక్రటరీ వివేక్, మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, బీమా క్లెయిమ్స్ చెల్లింపు, గాయపడిన వారికి వైద్య ఖర్చులు, వారి కుటుంబాల పోషణ బాధ్యతలను కూడా కంపెనీ వహిస్తుందని స్పష్టం చేశారు. ప్రమాదానికి రియాక్టర్ పేలుడే కారణం కాదని చెప్పారు. మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఘటన స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం తప్పనిసరి అని పేర్కొన్నారు. యాజమాన్యం ప్రకటనపై 48 గంటల ఆలస్యం కలుగడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తాజాగా కంపెనీ పత్రికా ప్రకటన వెలువడింది. అలాగే, ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని మూడు నెలల పాటు ప్లాంట్ కార్యకలాపాలు నిలిపివేస్తామని సిగాచి యాజమాన్యం తెలిపింది.

