ఇరాన్ పై ఇజ్రాయిల్ క్షిపణి దాడులు – తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం
ఇజ్రాయిల్ తన ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరిట శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తోపాటు కీలక ప్రాంతాలపై భారీ వైమానిక దాడులకు పాల్పడింది. డ్రోన్లు, క్షిపణులతో సాగిన ఈ దాడుల్లో పలువురు ప్రముఖులు మరణించారని అంతర్జాతీయ వార్తా ఏజెన్సీలు తెలిపాయి. ముఖ్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చీఫ్ మేజర్ జనరల్ హుస్సేన్ సలామి మృతిచెందినట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.గత కొంతకాలంగా ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చిన వేళ, ఈ దాడి అనేక అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది. యుద్ధం ముప్పు మరింత ముదురుతుందా? అనే ప్రశ్నపై ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టి సారిస్తోంది.
లక్ష్యంగా అణుస్థావరాలు, సైనిక శిబిరాలు
ఈ దాడుల్లో టెహ్రాన్, ఇస్ఫహాన్ తదితర ప్రాంతాల్లోని అణుస్థావరాలు, సైనిక శిబిరాలే ప్రధాన లక్ష్యంగా దాడులు జరిగాయి . వరుస పేలుళ్లతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. భారీ ఆస్తి నష్టం సంభవించినట్టు స్థానిక వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఎమెర్జెన్సీని ప్రకటించారు. తమను నాశనం చేయడం కోసం అణ్వాయుధాలు రెడీ చేస్తున్న ఇరాన్ పై దాడులుచేయడం మినహా తమకు మరొక మార్గం లేదని ఇజ్రాయిల్ చెబుతుంది. ఈ యుద్ధస్దితి వలన అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగొచ్చని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.