గ్రామ పాలనకు గండికొట్టిన ప్రభుత్వం -ఎమ్మెల్యే హరీష్ రావు
గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయకుండా గ్రామీణ స్థానిక సంస్థలను దెబ్బతీశారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ సీఎం అరవింద్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. గత 18 నెలలుగా పంచాయతీలకు నిధులు రాకుండా, గ్రామాల్లో పని చేయలేని పరిస్థితి వచ్చిందని, పరిశుభ్రత పూర్తిగా కుప్పకూలిపోయిందని, కార్మికులు జీతాలు లేక నిరసనలకు దిగుతున్నారని ఆరోపించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా మారిందని, రాష్ట్రంలో 12,941 పంచాయతీలకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ లాంటి వసతులు కల్పించామని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో డీజిల్ కొనుగోలు చేసేందుకు కూడా నిధుల్లేక, చెత్త సేకరణ నిలిచిపోయిందని విమర్శించారు. రద్దీ లైట్లు మార్చడంలేదు, శుభ్రత లేదు, పంచాయతీ కార్మికులకు రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో వారు సమ్మెలోకి వెళ్లారు అని తెలిపారు.గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం నెలకు రూ.275 కోట్లు, ఏడాదికి రూ.3,300 కోట్లు గ్రామ పంచాయతీలకు, రూ.1,700 కోట్లు పట్టణ శుభ్రతకు విడుదల చేసేదని తెలిపారు. కానీ ఇప్పటి ప్రభుత్వం ఒక పైసా కూడా విడుదల చేయలేదని, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి కార్యక్రమాలూ జరగడం లేదని పేర్కొన్నారు.”రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి మంత్రుల పదవుల కేటాయింపుల్లో మూడు రోజులు గడుపుతున్నారు, కానీ గ్రామాలు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతున్నాయి,” అంటూ హరీష్ రావు మండిపడ్డారు.