‘పీవోకేను స్వాధీనం చేసుకుంటాం’..కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)ను త్వరలోనే స్వాధీనం చేసుకుంటామని, భౌగోళికంగా విడిపోయినా వారు భారత్లో ఏకమవ్వాలనుకుంటున్నారని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీలో ఒక కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పీవోకే ప్రజలు మనవాళ్లేనని, అక్కడి ప్రజలలో కొందరు మాత్రమే తప్పుదారి పట్టారని, అధికశాతం ప్రజలు భారత్తో కలిసి ఉండాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. గ్రేట్ ఇండియాను సాధించడమే తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా దేశభద్రతకు మేకిన్ ఇండియా ప్రాముఖ్యం తెలిసివచ్చిందన్నారు. భారత్ ఫైటర్ జెట్లు, క్షిపణి వ్యవస్థలను, యుద్ధ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని వ్యాఖ్యానించారు. మన ఆయుధ సంపత్తి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నారు.