కవిత లేఖకు కేటీఆర్ స్పందన
బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత, తన తండ్రి పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ లేఖలో పేర్కొన్న విషయాలను బట్టి బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా అమెరికా నుండి వచ్చిన కవిత శంషాబాద్ విమానాశ్రయం వద్ద మీడియాతో మాట్లాడారు. ఆ లేఖ రెండు వారాల క్రితమే కేసీఆర్‌కు రాశానని పేర్కొన్నారు. కానీ తన కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి అమెరికాకు వెళ్లిన తర్వాత అది లీకయ్యిందని, అంటే దానివెనుక ఎవరున్నారో ఆలోచించాలన్నారు. తనపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలనే తాను బహిర్గతం చేశానని, వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదని వెల్లడించారు. ఈ లేఖ నేపథ్యంలో నేడు బీఆర్‌ఎస్ వర్కంగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్ స్పందించనున్నారు. నేడు తెలంగాణభవన్‌లో ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కవిత లేఖపై ప్రస్తావిస్తారని అనుకుంటున్నారు.

