పాతబస్తీ దుర్ఘటన..ఇదే కారణం..
హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్ చౌరస్తాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడ్డారు. ఈ వార్త ఆదివారం ఉదయాన్నే నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదం తెల్లవారుజామున జరగడంతో నిద్రలోనే కొందరు మృత్యుఒడిలో చేరుకున్నారు. వీరిలో 8 మంది చిన్నారులు, నలుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. ఈ వార్త గురించి తెలిసిన రాష్ట్రపతి, ప్రధాని సహా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు భట్టి, పొన్నం, శ్రీధర్ బాబులు సంఘటనా స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ గుల్జార్ హౌస్‌లో ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్‌మోదీకి మూడంతస్తుల భవనం ఉంది. కింద మూడు ముత్యాల షాపులు ఉన్నాయి. పై రెండు అంతస్తులలో ప్రహ్లాద్ మోదీ, ఆయన సోదరుడు రాజేంద్ర కుమార్ మోదీ వారి కుటుంబాలు, పిల్లలు, మనుమలతో సహా ఉంటున్నారు. ప్రమాద సమయానికి 21మంది కుటుంబసభ్యులు ఆ ఇంటిలో ఉన్నట్లు చెప్తున్నారు. తెల్లవారుజామున ప్రవేశమార్గం వద్ద షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో మంటలు చెలరేగి పై అంతస్తులలో ఉన్న నాలుగు ఏసీలు ఒక్కసారిగా పేలాయి. దట్టమైన పొగ కారణంగా వీరు ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకున్నారు. బయటకు వచ్చే క్రమంలో కుప్పకూలిపోయారు. టెర్రాస్ పైకి చేరిన నలుగురు మాత్రం ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అగ్నిమాపక సిబ్బంది చెప్తుండగా, షార్ట్‌సర్క్యూట్ జరగలేదని విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనితో సంఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మృతులకు రాష్ట్రప్రభుత్వం రూ.5 లక్షలు, కేంద్రప్రభుత్వం రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది.