accidentHome Page SliderNationalNews

‘గోల్డెన్ అవర్ ఎందుకు అమలు చేయట్లేదు’.. సుప్రీం మండిపాటు

కేంద్ర ప్రభుత్వం అలసత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. తీవ్రమైన కోర్టు ఉల్లంఘన చర్యలను మందలించింది. రోడ్డు ప్రమాద బాధితులకు అందించే నగదు రహిత చికిత్స గోల్డెన్ అవర్‌ను ఎందుకు అమలు చేయట్లేదని నిలదీసింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆసుపత్రి ఖర్చులకు భయపడి సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు సమీప ఆసుపత్రిలో చేర్చి ఉచిత వైద్య సదుపాయం కల్పించే ఉద్దేశంతో ఈ క్యాష్ లెస్ ట్రీట్‌మెంట్‌ను వర్తింపజేయాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ స్కీమ్ కింద ప్రమాదం జరిగిన గంటలోగా ఆసుపత్రిలో చేర్చితే, చికిత్సకు అయ్యే ఏడు రోజుల వరకూ రూ.1 లక్షా 5 వేల ఖర్చును ప్రభుత్వం రీఎంబర్స్‌మెంట్ చేస్తుంది. అలాగే హిట్ అండ్ రన్ కేసులలో మరణించిన వారి కుటుంబాలకు కూడా రూ.2 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలి.   దీని అమలుకు మార్చి 14వ తేదీని గడువుగా ప్రకటించింది. అయితే గడువు దాటినా దీనిని అమలు చేయలేదు. దీనితో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి, సీనియర్ అధికారులకు కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లు అందుకున్న అధికారులు కోర్టుకు ఏప్రిల్ 28న హాజరై తమ వివరణ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.