మృత్యుకూపంగా మారిన మయన్మార్, థాయ్‌లాండ్
మయన్మార్, థాయ్‌లాండ్ దేశాలను శుక్రవారం భారీ భూకంపాలు కుదిపేశాయి. భారీ భవనాలు కూలిన ఘటనల్లో ఆ ప్రదేశాలు మృత్యుకూపంగా మారాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకూ రెండుదేశాలలో మృతుల సంఖ్య 700 దాటింది. ఒక్క మయన్మార్‌లోనే కనీసం 694 మంది మరణించారు. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో 10 మంది మరణించారు. శిథిలాలను తొలగిస్తుంటే హృదయవిదారక దృశ్యాలు దర్శనమిచ్చాయి. స్కూల్స్, ఆఫీసులు, ఆసుపత్రులు అన్నీ కుప్పకూలాయి. దీనితో తమవారి కోసం వెదుకుతున్న బంధుమిత్రుల ఆర్తనాదాలు కంటతడి పెట్టిస్తున్నాయి. మయన్మార్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూమి కంపించింది. భూకంప బాధితుల కోసం భారత్ మయన్మార్‌కు తన ఆపన్నహస్తాన్ని అందించింది. 15 టన్నుల సహాయక సామాగ్రిని మయన్మార్‌కు పంపించింది. గుడారాలు, ఆహారపొట్లాలు, సోలార్ లైట్లు, మందులు వంటి అత్యవసర సామాగ్రిని మిలటరీ విమానంలో పంపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది.