మా కంటే .. మీ సంపాదనే బెటర్.. చిన్నారులతో మాజీ మంత్రి
హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున హోలీ పండుగ వస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ రంగుల్లో తడిసి ముద్దవుతారు. అయితే, రంగుల పండుగ వేళ గ్రామాల్లో జాజిరి పాటలు మారుమోగిపోతున్నాయి. ఉత్సాహంగా పాటలు పడుతూ.. ఇంటింటికీ తిరుగుతూ చిన్నారులు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జగిత్యాలలో చిన్నారులు జాజిరి పాటలు పాడుకుంటూ ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఇక్కడే ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. డబ్బులిమ్మని చిన్నారులు జీవన్ రెడ్డిని అడగ్గా.. ఆయన ఇప్పటి వరకు మీరు ఎన్ని డబ్బులు వసూలు చేశారో చూపించాలని వారిని అడిగారు. దీంతో వారంతా జేబుల్లో ఉన్న చిల్లరను బయట టేబుల్ పై వేసి ఆయనకు చూపించారు. ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు జమ చేశారని చిన్నారులను ప్రశ్నించగా.. వారు రూ.500 అంటూ సమాధానమిచ్చారు. అది విన్న జీవన్ రెడ్డి మా కంటే.. మీ సంపాదనే బెటర్ అంటూ కామెంట్ చేశారు. ఆఖరికి ఆయన జేబులోంచి రూ.100 ఇచ్చి దాచుకోండని పిల్లలకు ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.

