దేశంలో 834 మందికో డాక్టర్.. కేంద్రం
దేశ జనాభాలో వైద్యుల నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. ప్రస్తుతానికి ప్రతీ 834 మంది పేషంట్లకు ఒక డాక్టర్ ఉన్నారని కేంద్రం నివేదిక ఇచ్చింది. మెడికల్ కాలేజీలు 82 శాతం పెరిగాయని, అయినా వైద్యుల సంఖ్య జనాభా అవసరాలకు తగినట్లు పెరగడం లేదని, కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్ సభలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. 2014లో మెడికల్ కాలేజీలు 387 ఉన్నాయని, ఇప్పుడు వాటి సంఖ్య 706కి చేరిందన్నారు. MBBS సీట్లు కూడా 51,348 ఉండగా, అవి 112 శాతం పెరిగాయన్నారు. ప్రస్తుతం 1,08,940కి చేరాయని పేర్కొన్నారు. పీజీ సీట్లు కూడా 127 శాతం పెరిగాయని, గతంలో 31,185 ఉండగా, ఇప్పుడు 70,674కి చేరాయన్నారు.