Home Page SliderNationalNews AlertTrending Today

దేశంలో విద్యార్థులు లేని 8 వేల స్కూళ్లు

. నానాటికీ పెరుగుతున్న విద్యార్థులు లేని పాఠశాలలు
. కోటి దాటిన ఉపాధ్యాయుల సంఖ్య
. ఆర్థిక వ్యవస్థకు పెద్ద భారంగా మారిన స్కూళ్లు
. విద్యా శాఖ అధికారుల ఆందోళన
. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకపోవడమే కారణం

ఇంటర్నెట్ డెస్క్ : భారతదేశంలో విద్యార్థులు లేకుండా నడుస్తున్న పాఠశాలలు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజా విద్యాశాఖ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 8,000 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా లేరు. ఈ పాఠశాలల్లో బోధకులు, మౌలిక వసతులు ఉన్నప్పటికీ, విద్యార్థులు లేకపోవడం విద్యా వ్యవస్థలో ఉన్న అసమతుల్యతను స్పష్టంగా చూపిస్తోంది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కీలక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటిలో ముఖ్యమైనది విద్యార్థులు లేని పాఠశాలలు. 2024 – 25 విద్యా సంవత్సరంలో దాదాపు 8 వేల పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం ఈ పరిస్థితికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం కోటి దాటింది. ఈ రకంగా విద్యారంగం చాలామందికి ఉపాధి కల్పిస్తోంది. కానీ ప్రభుత్వం ఇంత ఖర్చు చేస్తున్నా, భవనాలు, మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల జీతాల కోసం ఎంతో వెచ్చిస్తున్న ప్రజాధనం విద్యార్థులు పాఠశాలలో చేరకపోవడంతో వృధా అవుతోంది. మరి కొన్ని చోట్ల కాంట్రాక్టు ఉపాధ్యాయులు 20 వేల మంది జీతాలు లేకుండా పనిచేస్తున్నట్లు సమాచారం. దీనితో వారు నిరాశతో వృత్తిపై దృష్టి పెట్టలేక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు.
ఇలాంటి పాఠశాలలు అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దూరప్రాంత గ్రామాలు, వలసల కారణంగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం ప్రధాన కారణంగా చెప్పబడుతోంది. విద్యాశాఖ అధికారులు ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా పరిగణిస్తున్నారు. విద్యార్థులు లేని పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయడం, లేదా విద్యా వనరులను మళ్లించడం వంటి చర్యలను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల నమ్మకం తగ్గిపోవడం, తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లవైపు మొగ్గు చూపడం ప్రధాన కారణం. గ్రామీణ ప్రాంతాల్లో గుణాత్మక విద్యా లోపం కూడా దీనికి కారణం. ఈ లోపాలు సరిదిద్దుకుంటే ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది.