ఇమ్రాన్ ఖాన్‌కు 8 రోజుల కస్టడీ, అరెస్టు తర్వాత టార్చర్ చేశారని న్యాయమూర్తికి ఫిర్యాదు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అవినీతి నిరోధక కోర్టు ఎనిమిది రోజుల పాటు కస్టడి విధించింది. నేషనల్ అకౌంటబిలిటీ (NAB) అవినీతి కేసుల్లో ప్రశ్నించేందుకు 10 రోజుల కస్టడీ కోసం ఇస్లామాబాద్‌లోని కోర్టులో ఇమ్రాన్‌ను ప్రవేశపెట్టారు. ఇస్లామాబాద్‌లో సాధారణ విచారణ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేయడంతో పాకిస్తాన్‌లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో నుంచి రాత్రి గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు.

కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారని, వాష్‌రూమ్‌ను కూడా ఉపయోగించుకోనివ్వలేదని ఇమ్రాన్ ఖాన్ కోర్టులో ఆరోపించారు. నెమ్మదిగా గుండెపోటు వచ్చేలా తనకు ఇంజెక్షన్ ఇచ్చారని సంచలన ఆరోపణ చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఈ నెల 17న తదుపరి విచారణ చేపట్టనుంది. ఖాన్ అరెస్టుతో పాకిస్తాన్ అంతటా మద్దతుదారులు భారీ నిరసనలకు దిగారు. నిరసనలు ఆస్తుల ధ్వంసానికి దారితీశాయి. వచ్చే ఎన్నికల తర్వాత, తిరిగి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి షబాజ్ షరీఫ్ సర్కారు కుట్ర చేస్తోందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు.