సమగ్ర సర్వేలో 75 ప్రశ్నలు
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటి కుటుంబ సర్వేకు పూర్తి స్థాయిలో సమాయత్తమయ్యింది. దీనికోసం 75 ప్రశ్నలతో ప్రశ్నావళి తయారు చేసింది. దీనిలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాలకు సంబంధించిన వివరాలను అడుగుతారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలతో ఈ ప్రశ్నావళి ఉంటుంది. రెండు పార్టులుగా 8 పేజీలలో సమాచారం పూరిస్తారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు, వారి విద్యా, ఉద్యోగ, ఉపాధి, రిజర్వేషన్, రాజకీయ సమాచారాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. భూమి విషయంలో ధరణి పట్టా నెంబరు, భూమి వివరాలు చెప్పవల్సిందే. రిజర్వేషన్ పరంగా ఏ ప్రయోజనాలు పొందారో కూడా చెప్పవలసి ఉంటుంది. రేషన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, విద్యుత్ బిల్లులు, స్థిర చరాస్తుల వివరాలు, వంట గ్యాస్ వంటి వివరాలు సేకరిస్తారు.

