పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే…
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంగళవారం నాడు ఎస్‌ఐపీబీ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలోనీ పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో ఏపీ పెట్టుబడుల సాధనపై సీఎం జగన్ హామీ మేరకు రాష్ట్రానికి నూతనంగా రూ. 5,191 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులకు సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ప్రైవేటు సహా అన్నిరకాల పరిశ్రమల్లో కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు, అది సమర్థవంతంగా నడవాలంటే ఆప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరమని స్థానిక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్య పడుతుందని పరిశ్రమలతో పాటు స్థానిక ప్రజల అభివృద్ధి కోసమే ఈ ప్రభుత్వం రాగానే చట్టం తీసుకు వచినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో సరిపడా మానవ వనరులు ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధికి కొదవలేదన్నారు. పరిశ్రమలకు శుద్ధిచేసిన, డీ శాలినేషన్ నీటినే వినియోగించుకునేలా చూడాలన్నారు. జనాభా పెరుగుతున్న కొద్దీ తాగునీటికీ, వ్యవసాయానికీ మంచి నీటికొరత రాకుండా చూడాలంటే డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లభ్యమయ్యే నీటిని పరిశ్రమలకు ఇవ్వడంపై తగిన చర్యలు తీసుకోవాలన్న సూచించారు. ఇజ్రాయిల్ తరహ విధానాలతో ముందుకు సాగేలా ప్రణాళికలు ఉండాలని సీఎం అధికారులకు దిశా నిర్దేశం చేశారు. కంపెనీలు ఏవైనా సరే రైతుల నుంచి పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిందేనని సీఎం జగన్ అదేశించారు.

